Sunday, April 12, 2009

అర్జున్ ప్రతాపనెని

జయభేరి - {మహా ప్రస్థానం - శ్రీ శ్రీ}

నేను సైతం
ప్రపంచాగ్ని కి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వ వ్~ఱుష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను!

నెను సైతం
భువన ఘోషకు
వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను.

ఎండ కాలం మండినప్పుడు
గబ్బిలం వలె
క్రాగి పోలేదా!
వాన కాలం ముసరి రాగా
నిలువు నిలువున
నీరు కాలేదా?
శీత కాలం కోత పెట్టగ
కొరడు కట్టీ,
ఆకలేసీ కేక లేశానే!

నే నొకణ్ణే
నిల్చిపోతే-
చండ్రగాడ్పులు, వాన మబ్బులు, మంచు సోనలు
భూమి మీదా
భుగ్న మౌతాయి!

నింగి నుండీ తొంగీ చూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు క్రక్కుకుంటూ
పేలిపోతాయి!

పగళ్ళన్నీ పగిలిపోయీ,
నిశీధాలూ విశీర్ణిల్లీ,
మహా ప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది!

నే నొక్కణ్ణి ధాత్రినిండా
నిండి పోయీ,
నా కుహూరత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహుర్తా లాగమిస్తాయి!

నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్ల రేకై పల్లవిస్తాను!
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్చనలు పోతాను!

నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!

శ్రీ శ్రీ - జూన్ 2, 1933
శ్రీ శ్రీ 'మహా ప్రస్తానం' నుంచి సంగ్రహితం 

No comments: